జనం న్యూస్ జూన్ 26(రిపోర్టర్ రాజు)పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్వి పిలుపునిచ్చారు.జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని ఆమె అధికారులకు,సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా గురువారం వజ్రకరూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో డాక్టర్ తేజస్వి మాట్లాడుతూ, 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం ద్వారా వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే తొలి రోజు చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించేందుకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించి,ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పోలియో చుక్కలు అందించాలని ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్వో లక్ష్మీదేవి,హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, ఎంపీహెచ్ఈఓ గురు ప్రసాద్,సూపర్వైజర్లు నాగశంకర్,సుశీలమ్మ, ఎంఎల్హెచ్పీలు,ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.