గిరిజనుల హక్కులకై జడ్పీ సర్వసభ్య సమావేశంలో గర్జించిన అనంతగిరి జడ్పీటీసీ దిసరి గంగరాజు..?

*బాక్సైట్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల సర్వేల అనుమతులు తక్షణమే రద్దు చేయాలి. * అక్రమ సర్వేలు చేసేవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. * విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా వైద్యాధికారి (DM&HO) ని సరెండర్ చేయాలి. * బొర్రా గుహల వద్ద గిరిజన వ్యాపారులను తొలగిస్తే ఊరుకునేది లేదు.

జనం న్యూస్, జూన్ 28, అల్లూరి జిల్లా ప్రతినిధి గోపిరెడ్డి: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జిల్లాపరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో నెలకొన్న పలు తీవ్రమైన ప్రజాసమస్యలపై అనంతగిరి సిపిఎం జడ్పీటీసీ దిసరి గంగరాజు గట్టిగా గళమెత్తారు. గిరిజన చట్టాల ఉల్లంఘన, వైద్యశాఖలో అవినీతి, గిరిజన జీవనోపాధి దెబ్బతీసే చర్యలపై ఆయన సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ పోడియం వద్ద బైఠాయించడంతో సభ ఒక్కసారిగా స్తంభించింది. ఆయన డిమాండ్లకు తోటి సభ్యులు మద్దతు తెలపడంతో, బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలకు అనుమతించబోమంటూ సభలో కీలక తీర్మానం చేశారు.
కూటమి ప్రభుత్వంపై ధ్వజం – అక్రమ సర్వేలు ఆపాలి : హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో అదానీ, నవయుగ వంటి కార్పొరేట్ కంపెనీలకు గిరిజనుల భూములను, అడవులను ధారదత్తం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గంగరాజు తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలంతా ముక్తకంఠంతో ప్రాజెక్టులను వద్దు అంటున్నా, జియాలజికల్ సర్వేల పేరుతో మజ్జివలస, సరియా వంటి గ్రామాల్లో అధికారులు కుట్ర పూరితంగా పర్యటిస్తున్నారని మండిపడ్డారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి ఐదవ షెడ్యూల్ ఏరియాలో 1/70 చట్టానికి, పీసా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమంగా చొరబడుతున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎవరినీ రానివ్వమని హామీ ఇచ్చినా, ప్రస్తుతం జీకే వీధి, చింతపల్లి కేంద్రాలుగా ‘సీ.ఎం.టి’ సంస్థ ద్వారా దొంగచాటుగా బాక్సైట్ సర్వేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ గ్రామాల్లో ఇలాంటి సర్వేలు చేస్తే గిరిజనులంతా కలిసి వారిని కట్టిపడేస్తారని హెచ్చరించారు.
అవినీతి నిలయంగా వైద్య శాఖ.. DM&HO ను సరెండర్ చేయాలి : అల్లూరి జిల్లా వైద్యాధికారి (DM&HO) డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ విధులకు గైరహాజరవుతూ, జిల్లా ఆరోగ్య సంస్థలను అవినీతి కేంద్రాలుగా మార్చారని జడ్పీటీసీ ఆరోపించారు. పినకోట పీహెచ్‌సీలో డాక్టర్ హేమంత్ కుమార్ విధులకు రాకుండానే, హాజరు పట్టికలో సంతకాలు పెడుతూ అటెండెన్స్ మేనేజ్ చేస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని నిరూపించారు. జూన్ 23న తాను స్వయంగా పీహెచ్‌సీని సందర్శించినప్పుడు ఈ అక్రమాలు వెలుగుచూశాయని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా వైద్యాధికారిని తక్షణమే సరెండర్ చేయాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
బొర్రా గిరిజన వ్యాపారులకు న్యాయం చేయాలి : ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొర్రాగుహల వద్ద 109 గిరిజన కుటుంబాలు చిన్న చిన్న దుకాణాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 కోట్ల టూరిజం నిధులతో రోడ్డు విస్తరణ పేరుతో వారి పాకలను తొలగించడం అన్యాయమని గంగరాజు పేర్కొన్నారు. టూరిజం డిపార్ట్‌మెంట్ వారి డీపీఆర్‌లో కేవలం 38 షాపులు మాత్రమే నిర్మిస్తామని చెప్పడం సరికాదని, ఆ 109 మంది బాధితులకూ పూర్తిస్థాయిలో న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సర్వసభ్య సమావేశంలో పెదబయలు జడ్పీటీసీ కూడ బొంజు బాబు, చింతపల్లి జడ్పీటీసీ బాలయ్య పడాల్‌లతో పాటు వివిధ మండలాల జడ్పీటీసీ సభ్యులు గంగరాజుకు మద్దతుగా నిలిచారు. వేదికపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ విద్యాధరి, మరియు జెడ్పీ సీఈఓ ఎం. నారాయణమూర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *