
జనం న్యూస్ నవంబర్ 2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్ అశ్వరావుపేట: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్’ (సెయిర్) పోర్టల్ అద్భుతంగా పనిచేస్తోందని అశ్వారావుపేట అదనపు ఎస్ఐ దేవ్ సింగ్ తెలిపారు. ఈ పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న ఒక ఖరీదైన మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసి, ఆదివారం నాటి సమాచారం ప్రకారం బాధితుడికి సురక్షితంగా అందజేశారు. పోలీసుల కథనం ప్రకారం. అశ్వరావుపేట పరిధిలోని మారుతి నగర్‌కు చెందిన దాసరి అబ్రహం (తండ్రి: రాములు) గత నెల సెప్టెంబర్ 20వ తేదీన తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన అశ్వరావుపేట పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి మొబైల్ ఐఎంఈఐ (ఇమెయి) నంబర్ ఆధారంగా సెయిర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ సాంకేతికత సహాయంతో ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేసిన పోలీసులు, దానిని విజయవంతంగా రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను అదనపు ఎస్ఐ దేవ్ సింగ్ సమక్షంలో బాధితుడు అబ్రహంకు ఈరోజు తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న తన ఫోన్‌ను అతి తక్కువ కాలంలోనే తిరిగి పసిగట్టి అప్పగించినందుకు బాధితుడు పోలీసులకి మరియు సాంకేతిక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్ఐ మాట్లాడుతూ. ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటే కంగారు పడకుండా, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా స్వయంగా సెయిర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా పోగొట్టుకున్న మొబైళ్లను సులభంగా రికవరీ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.