జనం న్యూస్ జులై 3(రిపోర్టర్ రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలోని ఎల్‌ఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈఓ తిమ్మప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు, పాఠశాలలో నిర్వహిస్తున్న సంసిద్ధత (స్కూల్ రెడినెస్) కార్యక్రమాలను పరిశీలించారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్న బోధన, అభ్యాస కార్యక్రమాలను పరిశీలించి, విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ తిమ్మప్ప మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన తరగతికి అనుగుణంగా అవసరమైన అభ్యసన సామర్థ్యాలు, చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపరచుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు జయలలితతో పాటు ఉపాధ్యాయ సిబ్బందికి, సంసిద్ధత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో సంసిద్ధత కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని, నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.