ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లతో అధిక దిగుబడులు – రైతులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమల అధికారి ఎం.ఏ. సత్తార్

జనం న్యూస్ జూలై 2( రవీంద్ర )వికారాబాద్, బ్యూరో వ్యవసాయంలో నీటి పొదుపు, కలుపు నివారణ, నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఎంతో ఉపయోగకరమని జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమల అధికారి ఎం.ఏ. సత్తార్ తెలిపారు. రైతులు ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకొని ప్రభుత్వ రాయితీని పొందాలని ఆయన సూచించారు. మొక్కల చుట్టూ ఉన్న నేల భాగాన్ని ప్లాస్టిక్ షీట్‌తో కప్పే విధానాన్ని మల్చింగ్ అంటారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు అందకపోవడంతో సుమారు 85 శాతం వరకు కలుపు నివారణ జరుగుతుంది. దీంతో కలుపు మందుల వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. మల్చింగ్ షీట్ల వినియోగంతో నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి 30–40 శాతం వరకు నీటి ఆదా అవుతుంది. దీనిని బిందు సేద్యంతో కలిపి ఉపయోగిస్తే అదనంగా మరో 20 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఫలితంగా పంటలకు అవసరమయ్యే 2–3 నీటి తడులు తగ్గుతాయి. వర్షపు నీరు లేదా సాగునీరు నేరుగా నేలపై పడకుండా ఉండటంతో నేల కోత తగ్గి భూసారం సంరక్షించ బడుతుంది. అలాగే నేల ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడి వేర్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహించి ఆరోగ్యంగా పెరుగుతాయి. మల్చింగ్ షీట్లపై పడిన సూర్యరశ్మి పరావర్తనం కావడంతో ఆకుల అడుగు భాగంలో ఉండే రసం పీల్చే పురుగుల ప్రభావం తగ్గి, వైరస్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణలో ఉంటుంది. దీంతో సస్యరక్షణ ఖర్చు కూడా తగ్గుతుంది. డ్రిప్ సేద్యంతో కలిపి మల్చింగ్‌ను వినియోగించడం వల్ల ఎరువులు, నీరు నేరుగా మొక్కల వేర్లకు చేరి వృథా కాకుండా ఉంటుంది. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. మల్చింగ్ పద్ధతి ద్వారా పంటలకు అనుకూల సూక్ష్మ వాతావరణం ఏర్పడి 20 నుంచి 50 శాతం వరకు అధిక దిగుబడులు రావడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తి లభిస్తుందని జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమల అధికారి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్ జిల్లాకు 952 ఎకరాల ప్లాస్టిక్ మల్చింగ్ లక్ష్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేయనుంది. రైతులు భూమి పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమల అధికారి ఎం.ఏ. సత్తార్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *