జనం న్యూస్ 30జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. వాంకిడి: మండలంలోని సరండి గ్రామంలో విద్యా శాఖ, గ్రామ పంచాయతీ పరిపాలన పనితీరుపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందాల్సిన ప్రభుత్వ వ్యవస్థలో సమయపాలన, బాధ్యతాయుత నిర్వహణ లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం గ్రామ ప్రాథమిక పాఠశాలను గ్రామపంచాయతీ సర్పంచ్ మొహార్లే బాపూజీ ఆకస్మికంగా సందర్శించడంతో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. సర్పంచ్ పాఠశాలలో విద్యార్థుల బోధన, హాజరు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి బోధన సక్రమంగా జరుగుతోందా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహణపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విధులకు గైర్హాజరైన విషయం సర్పంచ్ దృష్టికి వచ్చింది. గ్రామస్థుల నుంచి కూడా ప్రధానోపాధ్యాయుడు తరచుగా విధులకు హాజరుకావడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మండల విద్యాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి వివరణ కోరారు. దీనికి స్పందించిన అధికారులు ప్రధానోపాధ్యాయుడు అధికారిక సెలవులో ఉన్నారని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై మరింత స్పష్టత కోసం మీడియా ప్రతినిధులు మండల విద్యాధికారిని సంప్రదించేందుకు విద్యాధి కారి కార్యాలయానికి వెళ్లగా విద్యాధి కారి కార్యాలయంలో విద్యాదికారి సైతం కార్యాలయంలో అక్కడ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీ మాత్రమే కనిపించింది. ఆరా తీయగా విద్యాధికారి ఆయన పలు పాఠశాలల తనిఖీల్లో ఉన్నట్లు సిబ్బంది,ఆయన చరవాని ద్వారా తెలిపారు. అయినప్పటికీ అధికారికంగా స్పష్టమైన సమాచారం అందకపోవడం, వివరణల్లో పొంతన కనిపించకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడు సెలవులో ఉన్నప్పటికీ ఆ సమాచారాన్ని ముందుగానే గ్రామస్థులకు లేదా పాఠశాల నిర్వహణ కమిటీకి తెలియజేశారా? సెలవు కాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా? విద్యార్థుల బోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మండల విద్యాధికారి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం, ఆయన నుంచి కూడా స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో విద్యా శాఖ పనితీరుపై ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయి. అధికారులు ఫీల్డ్ విజిట్లో ఉండడం సహజమే అయినప్పటికీ, ప్రజలకు అవసరమైన సమయంలో కార్యాలయంలో తగిన సమాచారం అందించే విధానం ఉండాలని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. విద్యా శాఖతో పాటు సరండి గ్రామపంచాయతీ కార్యాలయ నిర్వహణపై కూడా గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించడం లేదని, ఎప్పుడు కార్యాలయానికి వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే విషయంపై ప్రజలకు స్పష్టత లేదని ఆరోపిస్తున్నారు. పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలు, సంతకాలు తదితర అవసరాల కోసం గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూసినా కార్యదర్శి అందుబాటులో లేక వెనుదిరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా నార్లాపూర్ గ్రామానికి చెందిన ఓ ఇద్దరు గ్రామస్థులు కార్యదర్శి సంతకం అవసరమైన పనుల కోసం కార్యాలయానికి వచ్చి చాలాసేపు ఎదురుచూసినా ఆమె రాకపోవడంతో నిరాశగా వెనుదిరిగినట్లు మీడియా దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై కార్యదర్శిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిసింది. గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం… ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సమయానికి సేవలు అందకపోతే అనవసరంగా సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి, సమయపాలన పాటిస్తూ విధులు నిర్వర్తిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని అంటున్నారు. సర్పంచ్ తనిఖీ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రధానోపాధ్యాయుడి హాజరు వివరాలు, మండల విద్యాధికారి పర్యటనల వివరాలు, గ్రామపంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే ప్రధాన కేంద్రాలు. అలాంటి కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. సరండి గ్రామంలో తలెత్తిన ఈ పరిస్థితులను సంబంధిత ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుని, లోపాలను సరిదిద్ది ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.