జనం న్యూస్ జూన్ 29మండలం పెన్ పహాడ్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వి.బి.జి. రామ్‌జీ బిల్లు గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ బిల్లును వెంటనే రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో సిఐటియు,వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమన్యమైన కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ మాట్లాడుతూ జూలై 1న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను బలహీనపరిచే ఎలాంటి చర్యలనైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే గ్రామాల్లో పని అడిగిన కూలీలకు తగినంత పని కల్పించడం లేదన్నారు. చేసిన పనులకు కూలి చెల్లింపులు వారాలు, నెలల తరబడి ఆలస్యం అవుతుందన్నారు . పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేకపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం, పనిదినాలను పరిమితం చేయడం, సాంకేతిక నిబంధనల పేరుతో కూలీలను ఇబ్బందులకు గురిచేయడం వల్ల గ్రామీణ పేదల జీవనం సంక్షోభంలో పడిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో వి.బి.జి. రామ్‌జీ బిల్లు అమల్లోకి వస్తే గ్రామీణ పేదల ఉపాధి అవకాశాలు మరింత తగ్గిపోవడంతో పాటు, ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గి, వలసలు పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వి.బి.జి. రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు, పనులు కోరిన ప్రతి కుటుంబానికి తగిన ఉపాధి కల్పించి, పెండింగ్ కూలి బకాయిలను వెంటనే చెల్లించి, ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 1న జరిగే గ్రామీణ సమ్మెను ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుంజ వెంకటేశ్వర్లు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇరుగు రమేష్ .రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.