జనం న్యూస్/ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జాతీయ మాలల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాలలకు 5% రిజర్వేషన్ కాగితాలకే పరిమితం: రోస్టర్ విధానంలో దగా. ఎస్సీ వర్గీకరణ అనంతరం గ్రూప్-3 కింద మాల, మాల ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఉద్యోగ నియామకాలలో ఆ రిజర్వేషన్ అమలు కావడం లేదని దోసల చంద్రం ఆరోపించారు. ఇటీవల విడుదలైన ముద్రా పరీక్షల ప్రయోగశాల, టీఎస్ఆర్టీసీ ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క పోస్టు కూడా కేటాయించలేదని ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్ కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. నోటిఫికేషన్లలో రిజర్వేషన్ అమలు కాకపోవడంతో మాల యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని
దోసల చంద్రం అన్నారు. జిల్లాల వారీగా నియామకాలు చేపడుతున్నప్పటికీ మాలలకు కనీస స్థాయిలో కూడా ప్రాతినిధ్యం లభించడం లేదని పేర్కొన్నారు. రోస్టర్ విధానంలో మాలలను చివరి పాయింట్లలో ఉంచడం వల్ల వందల సంఖ్యలో పోస్టులు వచ్చినప్పుడే అవకాశం లభించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ విధానాన్ని వెంటనే సవరించి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాతీయ మాలల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం హెచ్చరించారు.