జొన్న రైతులను ఆదుకోవాలి.

*సోమవారంలోగా కొనుగోళ్లు ప్రారంభించాలి.లేదంటే కలెక్టరేట్ ముట్టడి *మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మా దేవేందర్ రెడ్డి

జనం న్యూస్ 2026 జూన్ 27( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతపల్లి, కాట్రియాల, పర్వతాపూర్ గ్రామాల్లో జొన్న సాగు చేసిన రైతులపరిస్థితిఅగమ్యగోచరంగా మారిందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం రామాయంపేట మార్కెట్ యార్డును బిఆర్ఎస్ నాయకులతో కలసి సందర్శించారు. జొన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగామాట్లాడుతూ.నెల రోజులుగా మార్క్‌ఫెడ్ ద్వారా జొన్నల కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గతంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే కొనుగోళ్లు ప్రారంభించారని గుర్తు చేశారు.అధికారుల సూచనల మేరకు పంట మార్పిడిలో భాగంగా రైతులు జొన్న సాగు చేశారని, ఇప్పుడు పంట చేతికొచ్చినా కొనుగోళ్లు లేక రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప రైతులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.మార్పిడి ద్వారా నాలుగు లారీల జొన్నలను కొనుగోలు చేసి,మట్టిపెళ్లలు ఉన్నాయనే సాకుతో తిరస్కరించారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.సోమవారంలోగా జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద భారీ ఉద్యమం చేపడతామని పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *