జనం న్యూస్ 02 జులై 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి :
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని భారీ అప్పులు, బకాయిలు మరియు అవినీతి కుంభకోణాలతో భ్రష్టుపట్టించారని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు… గత ప్రభుత్వాలన్నీ కలిపి ఉమ్మడి రాష్ట్రంలో రూ.68 వేల కోట్ల అప్పులు చేస్తే, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లకు పైగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో బకాయిలు పేరుకుపోయే పరిస్థితిని బీఆర్ఎస్ సృష్టించిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, డిస్కంలు, గ్రామ పంచాయతీలు, ఆర్టీసీ, సివిల్ సప్లై, మధ్యాహ్న భోజన పథకం, అభివృద్ధి పనుల కాంట్రాక్టర్ల బిల్లులు తదితర రంగాల్లో భారీ బకాయిలు వదిలి వెళ్లారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వీర్లపల్లి శంకర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని, అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుబిడ్డగా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నారని, విద్య, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో మార్పులు తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలైన దళితుడే ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఎకరాలకు సాగునీరు, కేజీ టు పీజీ విద్య వంటి హామీలను బీఆర్ఎస్ అమలు చేయలేదని విమర్శించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించామని తెలిపారు. కాలేశ్వరం, ఢిల్లీ లిక్కర్ కేసు, ఫార్ములా ఈ కార్ రేస్, ధరణి, గొర్రెల పంపిణీ, రైతుబంధు, డబుల్ బెడ్‌రూం, బతుకమ్మ చీరలు, మిషన్ కాకతీయ, హరితహారం, విద్యుత్ కొనుగోలు, ఇసుక రవాణా, రేషన్ బియ్యం తదితర అంశాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు అవినీతికి పాల్పడిన వివరాలను అవసరమైతే ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించారు. ఇకనైనా నిరాధార విమర్శలు మానుకోవాలని, లేకపోతే అన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, రఘు, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, నల్లమోని శ్రీధర్, కృష్ణ, రమేష్, జంగారి రవి, బాబు నాయక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.