రైతుల అభివృద్ధికి సహకార వ్యవస్థ కీలకం:బ్యాంక్ అధ్యక్షుడు వలి

జనం న్యూస్ జూన్ 30 (రిపోర్టర్ రాజు):భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాలు సోమవారం వజ్రకరూరులో ప్రారంభమయ్యాయి. జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల సందర్భంగా సహకార సంఘాల ప్రాధాన్యం, రైతుల అభివృద్ధిలో వాటి పాత్ర, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార రంగం అందిస్తున్న సేవలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బ్యాంకు అధ్యక్షుడు వలి, అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వజ్రకరూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ను బ్యాంక్ అధ్యక్షుడు వలి ప్రదర్శించారు. బ్యాంకు అధ్యక్షుడు వలి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయం అందుతున్న విధానాన్ని వివరించారు. వారోత్సవాల్లో భాగంగా రైతులు, సభ్యులు, ప్రజలకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించే సమావేశాలు, చర్చా కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బ్యాంకు అధ్యక్షులు వలి, అధికారులు వెల్లడించారు. సహకార రంగం మరింత బలోపేతం కావడానికి రైతులు, ప్రజలు సహకార సంఘాలతో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *