జనం న్యూస్, జులై 1, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండల : ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామ ఉపసర్పంచ్ బర్మా మల్లయ్యతో పాటు పలువురు వార్డ్ సభ్యులు, రమ్య, లౌక్య, భవ్య శ్రీ, పద్మ, మహేష్ మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మెట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో వారు గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి విశేష కృషి జరిగిందని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తోందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్‌లో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వేములకుర్తి మాజీ ఉప సర్పంచ్ అసతి రాజాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.