జనం న్యూస్ జూలై 3 (ముమ్మిడివరం ప్రతినిధి) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జ ఐశ్వర్యపై వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు మరియు కార్యకర్తలు కాట్రేనికోన పోలీస్ స్టేషన్ను భారీ ఎత్తున ముట్టడించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, విలేకరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతానికి, కులానికి లేదా మతానికి పరిమితమైన వ్యక్తి కాదని, కోట్లాది మంది ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న గొప్ప ప్రజానాయకుడని, అలాంటి రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే అర్హత గానీ, స్థాయి గానీ బొజ్జ ఐశ్వర్యకు లేవని తీవ్రంగా మండిపడ్డారు. పల్లంకుర్రు గ్రామం తన అమ్మమ్మ ఇల్లు అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆమె సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని, పోలీసులు వెంటనే స్పందించి ఆమె ఎక్కడున్నా గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. ఒకవేళ పోలీసులు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించి, చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, వీర మహిళలు, క్రియాశీల కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, బొజ్జ ఐశ్వర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను గట్టిగా వినిపించారు.