జనం న్యూస్ 27జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్: జైనూర్ మండల కేంద్రంలోని బాలాజీ నగర్‌లో విద్యుత్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం దొరకకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్లుగా లో వోల్టేజ్‌తో పాటు తరచూ విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల సహనం నశిస్తోంది.
. తక్కువ వోల్టేజ్ కారణంగా ఇళ్లలోని బల్బులు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం నెల రోజుల క్రితం స్తంభాలను మార్చినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని స్థానికులు తెలిపారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యుత్ సిబ్బంది చెప్పినా, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. జైనూర్ ఏఈ లచ్చన్న, సంబంధిత కాంట్రాక్టర్ వెంటనే స్పందించి అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి బాలాజీ నగర్‌లోని లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.