జనం న్యూస్/జూలై2/పోలవరం నియోజకవర్గం/రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్బంగా శుక్రవారం ఏలూరు నగరంలో జరిగే “హలో రైతన్న చలో ఏలూరు”బహిరంగ సభకు రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలనీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు పిలుపునిచ్చారు. రైతుసంఘం రాష్ట్ర మహాసభల ప్రచార జాతా మూడవ రోజు బుధవారం మండలం లోని రౌతుగూడెం,పి అంకంపాలెం, కామయ్యపాలెం జీలుగుమిల్లి, మీదుగా టీ నరసాపురం మండలం మీదుగా యాత్ర ముందుకు సాగింది. ఈ యాత్ర ప్రధాన కేంద్రాలలో రైతు సంఘం జిల్లా నాయకులు బొడ్డు రాంబాబు, సిరిబత్తుల సీతారామయ్య లు మాట్లాడారు.నేడు వ్యవసాయం కార్పొరేటీకరణ చేసేందుకు ప్రభుత్వాల విధానాలు ఉన్నాయని ఇవి మన రైతాంగానికి తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం వలన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటుందన్నారు. నేడు రైతుల వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందనని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.అన్ని పంటల రైతులు కష్టపడి పండించిన పంటలకు స్వామినాథన్ కమిషనర్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు.తక్షణమే మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, రైతు మనుగడ కోసం నేటి రైతాంగ ఉద్యమాలకు ప్రాధాన్యత ఉందని, ఇందులో రైతాంగం ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.జులై 3న హలో రైతన్న- చలో ఏలూరు కార్యక్రమానికి అన్ని పంటల రైతులు తరలిరావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పి.మంగరాజు,తెల్లం వంశీ,రైతుసంఘం నాయకులు తెల్లం సంకురుడు,ఎస్ శేషగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు టీ జగదీశ్, ప్రజానాట్య మండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.