కార్మికులకు కనీస వేతనాలు పెంచాలిసిఐటియు రాష్ట్ర కార్యదర్శి

*సుబ్బారావమ్మ డిమాండ్

జనం న్యూస్, మన్యం జిల్లా పార్వతీపురం, జూన్ 28. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ షెడ్యూల్ రంగాల్లోని పరిశ్రమలు, సంస్థల్లో పనిచేయుచున్న సుమారు 50 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో నిర్వహించిన కనీస వేతనాలు సాధన సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇప్పటికే కనీస వేతనాలు పెంచాలని అనేక ఆందోళనలు చేపట్టినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు పెంపుదలకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. గడిచిన 12 సంవత్సరాలుగా నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్లు ధరలు పెంచిన ఈ ప్రభుత్వం కార్మికులకు మాత్రం వేతనాలు పెంచకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. విద్య, వైద్యం భారంగా ఉన్న ఈ కాలంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్మికుల జీతాలు సవరించాల్సిన ఈ ప్రభుత్వం కార్మికుల జీతాల పెంపుదలకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రైవేట్ కంపెనీల యజమానులు గత 12 ఏళ్లుగా కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేయుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికులకు కనీస వేతనాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని అలా చేయని పక్షంలో వచ్చే జూలై నెల చివరివరకు ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా కార్మికులతో విస్తృత ప్రచారం చేయించి 30, 31 తారీఖుల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు డి. రమణారావు, వై. మన్మధరావు, ఉపాధ్యక్షులు ఇందిర, జ్యోతి, శివాని, శాంతి కుమారి మరియు కార్యదర్శులు బి.వి రమణ, ఎన్ వై నాయుడు, ఆర్. రాము. కోశాధికారి గొర్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *