పెండింగ్లో ఆరు డీఏలు …!

*ఇచ్చింది మూడు.. బకాయిపడ్డది ఆరు *ఏడాదికి ఒకటి ఇచ్చినట్టా…! *ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడ…? *ప్రశ్నిస్తున్న ఉద్యోగులు *హెల్త్‌ స్కీమ్‌కు 1.5శాతం కట్‌ *ప్రీమియం కట్‌చేశాక.. నెలకు జీవో

జనం న్యూస్ జూన్ 30 (రవీంద్ర) వికారాబాద్ బ్యూరో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్‌ బాకీపడ్డ పెండింగ్‌ డీఏల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకొంటే మొత్తంగా ఆరు డీఏలు సర్కార్‌ బాకీ పడింది. ప్రభుత్వం విధిగా ప్రతి ఆరు నెలలకోసారీ డీఏ ఇవ్వాలి. కానీ డీఏల విషయంలో కాంగ్రెస్‌ సర్కార్‌ పూర్తిగా చేతులెత్తేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర చరిత్రలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఇదే తొలిసారి. పైగా ఇన్ని డీఏలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పెండింగ్‌లో లేవు. ఆఖరుకు దివాలా.. పేదరికంతో బాధపడుతున్న రాష్ర్టాల్లోనూ ఒకటి రెండుకు మించి డీఏలు పెండింగ్‌లో లేవు. అత్యధిక డీఏల పెండింగ్‌తో తెలంగాణ రికార్డుకెక్కిందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.
జూలై 1న ఇవ్వాల్సిన డీఏ ఆ తేదీ రానే వచ్చింది. డీఏ ఇవ్వాలంటే క్యాబినెట్‌ ఆమోదం తెలుపాలి. ఆ తర్వాత సర్కార్‌ జీవో జారీచేయాలి. ఇప్పట్లో ఇవేవీ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. కనుక పెండింగ్‌ డీఏల లిస్టు చాంతాడంత అన్నట్టు ఆరుకు చేరిందని సంఘాల నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కరువు భత్యం(డీఏ) ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం. అధిక ధరలు, ధరల సూచీ ప్రకారం ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకూ ఒకటి చొప్పున విధిగా డీఏను విడుదల చేయాలి. కేంద్రం ప్రతి ఆరు నెలలకూ టంచన్‌గా డీఏలు మంజూరుచేస్తున్నది. అనేక రాష్ర్టా లు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మూడు డీఏలు మాత్రమే ఇచ్చింది. ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్‌ పాలనను చూస్తుంటే ఆరు నెలలకు డీఏ కాకుండా.. ఏడాదికో డీఏ అన్నట్టుగా పరిస్థితి ఉన్నది. ఈ రెండున్నరేండ్లలో మూడు డీఏలను మాత్రమే ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తున్నది. ఇచ్చిన మూడు డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. 2.5లక్షలకు పైగా సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ ఏరియర్స్‌ రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్క రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే అంతో ఇంతో జమవుతున్నాయి. 15శాతం పెండింగ్‌.. రాష్ట్ర ప్రభుత్వం బాకీపడ్డ ఆరు పెండింగ్‌ డీఏల మొత్తం 15శాతం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. ఒకశాతం డీఏ ఇస్తే ఏడాదికి రూ. 400 -500కోట్లు అవుతుంది. 15శాతం డీఏ, డీఏ బకాయిలు కలిపితే మొత్తం రూ. 10వేల కోట్లు దాటుతాయని అంటున్నారు. ప్రతి నెలా జీతం ఇస్తున్నామన్న నెపంతో సర్కార్‌ డీఏలు, పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ వంటి వాటి నుంచి తప్పించుకోజూస్తున్నదని మండిపడుతున్నారు. కీలక డిమాండ్లు ముందుపెట్టిన ప్రతిసారీ ఒకటో తేదీ జీతం అంశాన్ని తెరపైకి తెచ్చి ఆత్మరక్షణలో పడేస్తున్నదని వాపోతున్నారు. ఉద్యోగులు ఇంతగా నష్టపోతున్నా ఉద్యోగ సంఘాల నేతలు సైతం కిమ్మనడంలేదని పలువురు ఫైర్‌ అవుతున్నారు. హెల్త్‌ స్కీమ్‌కు 1.5శాతం కట్‌ జీవో జారీ చేసిన ప్రభుత్వం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనా, పెన్షనర్లైనా.. ఒక్కరికే కోత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రతకు సంబంధించిన ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)’ అమలు కోసం మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీరో జారీ చేసింది. ఇకపై ప్రతి ఉద్యోగి మూలవేతనం లేదా పెన్షనర్ల మూల పింఛను నుంచి ప్రతి నెలా 1.5శాతం మొత్తాన్ని ఈహెచ్‌ఎస్ హెల్త్‌ ఫండ్‌కు చందా కట్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ హెల్త్‌ స్కీమ్‌ను జూలై 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. మే నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల నుంచే ఈ కోత ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. తాజాగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ చందాల ద్వారా ఉద్యోగుల వాటాగా రూ.528 కోట్లు సమకూరనుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం ‘ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్టు’కు జమ చేయనుంది. ఇలా జమయ్యే రూ. 1,056 కోట్ల నిధులతో ఉద్యోగులకు ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు అందించనున్నారు. నిధుల కోత విధానంలో ఉద్యోగ సంఘాల నుంచి వ్యక్తమైన పలు సందేహాలకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చింది. భార్యాభర్తలిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు, లేదా వారిలో ఒకరు ఉద్యోగిగా ఉండి మరొకరు పెన్షనర్‌ అయితే.. ఒక్కరి జీతం నుంచే మాత్రమే సొమ్మును మినహాయిస్తారు. అలాగే, ఒక వ్యక్తి సర్వీసు పెన్షన్‌, కుటుంబ పెన్షన్‌(భర్త లేదా భార్య మరణాంతరం వచ్చేది).. ఇలా రెండు పింఛన్లు పొందుతున్నా కూడా ఒకే కోతకు నిబంధనలను పరిమితం చేశారు. ప్రీమియం కట్‌చేశాక.. నెలకు జీవో ఉద్యోగుల ఆరోగ్యపథకం(ఈహెచ్‌ఎస్‌) అమల్లో సర్కార్‌కు ముందుచూపు కొరవడింది. ఒక నెల ప్రీమియం కట్‌చేశాక.. నెల రోజులకు ఉద్యోగుల వేతనం నుంచి ప్రీమియం కట్‌చేసేందుకు అనుమతినిస్తూ సర్కార్‌ తాజాగా జీవో జారీచేసింది. జూన్‌ 1న ఉద్యోగులకు చెల్లించిన మే నెల జీతంలోనే 1.5% తొలి ప్రీమియంగా కట్‌చేశారు. కట్‌చేసిన మొత్తం సర్కార్‌ వద్దే ఉండిపోయింది. వాస్తవానికి మొదట ట్రస్టును ఏర్పాటు చేయాలి. ఈ ట్రస్టు పేరిట అకౌంట్‌ తీయాలి. ఆ తర్వాత 1.5% కట్‌చేసేందుకు వీలు కల్పిస్తూ జీవో జారీచేయాలి. ఆ తర్వాతే ప్రీమి యం కట్‌చేయాలి. ఇవేవీ లేకుండానే మే నెల జీతంలో 1.5% కట్‌చేశారు. తాజా గా జూలై 1న అందజేసే జూన్‌ జీతం నుంచి 1.5% కట్‌చేయాల్సి ఉంది. భార్యాభర్తలు ఉద్యోగులు.. పెన్షనర్లు అయితే ఒక్కరి నుంచే ప్రీమియం వసూ లు చేస్తామని ప్రభుత్వం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *