అంబటిపల్లి గ్రామంలో మహదేవపూర్ పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

జనం న్యూస్ జూన్ 25 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి. మహదేవపూర్ , జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం లోని అంబటిపల్లి గ్రామంలో అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణ లక్ష్యంగా గురువారం రోజు తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశాల మేరకు మహదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, మహదేవపూర్ ఎస్‌హెచ్‌ ఓ ఎమ్. సాంబమూర్తి మహదేవ్‌పూర్ ఎస్‌ఐ జె. రమేష్ , కాళేశ్వరం ఎస్‌ఐ భాగవత్, పలిమెల ఎస్సై టి. సాయి శశాంక్ మరియు పోలీసు సిబ్బంది గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఇంటింటి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులు, నేరచరిత్ర కలిగిన వ్యక్తుల వివరాలను సేకరించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా 30 లీటర్ల గుడుంబాను సీజ్ చేసారు, మొత్తం 65 వాహనాలను తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్లు లేని 6 వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు మరియు ఇతర రికార్డులను పరిశీలించారు. డిక్యుమెంట్ లేని వాటికీ జరిమానా వేయడం జరిగింది, అలాగే
గ్రామంలో గుడుంబా వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుడుంబా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాల పెరుగుదల మరియు సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. ప్రజల సహకారంతో గ్రామంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తామని, ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *