జనం న్యూస్ 1జూలై. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. సిర్పూర్ (యు): పోలీస్ స్టేషన్‌లో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు, వ్యాపారులు, దుకాణదారుల కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, గంజాయి నిర్మూలన మరియు రహదారి భద్రత అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) బి. అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. వేదికపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జైనూర్ ఈ. రమేష్ , ఎస్‌ఐ జైనూర్ జి. రవి కుమార్ , ఎస్‌ఐ సిర్పూర్ (యు) కొమురయ్య , ఎస్‌ఐ లింగాపూర్ చి. సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన 55 మంది గ్రామ సర్పంచ్‌లు, వ్యాపారులు, దుకాణదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌డీపీఓ బి. అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారాయని తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రధాన కూడళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, వ్యాపార సముదాయాలు, దుకాణాలు మరియు ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నివారించడంతో పాటు, నేరస్థులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభతరమవు తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామ సర్పంచ్ తమ గ్రామంలో ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, గంజాయి సాగు, రవాణా, విక్రయం లేదా వినియోగంపై ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, మత్తు పదార్థాల నిర్మూలనలో గ్రామ ప్రజాప్రతినిధులు, యువత, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగాన్ని నివారించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రజల బాధ్యత కూడా ఎంతో కీలకమని తెలిపారు. అనంతరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఈ. రమేష్ మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన మరియు రహదారి ప్రమాదాల నివారణలో గ్రామ సర్పంచ్‌లు, వ్యాపారులు, దుకాణదారులు పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేయాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత, మత్తు పదార్థాల రహిత, సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.