
జనం న్యూస్/సెప్టెంబర్ 03/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు కొయ్యలాగూడెంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా,రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారని కొనియాడారు.తన ఐదేళ్ల పాలనలో ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి,రాష్ట్ర ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, పావలా వడ్డీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన గొప్ప ప్రజా నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.రైతు కుటుంబం కన్నీరు పెట్టుకోకూడదనే ఆలోచనతో రైతులకు ఉచిత విద్యుత్ అందించిన రైతు బాంధవుడు వైఎస్సార్ అని, పేదవాడికి మెరుగైన వైద్యం అందాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని అన్నారు…వైఎస్సార్ గారు మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృద్ధి పనులు, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు…వైఎస్సార్ ఆశయాల సాధన కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని తెల్లం బాలరాజు గారు పేర్కొన్నారు.అనంతరం పేదలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.