మృగాల చేతిలో చిధ్రమవుతున్న పసిమొగ్గలు: ఆడపిల్లలకు భద్రత ఎక్కడ? చిక్కం గోపాలకృష్ణ

మద్యం మత్తులో పసిపిల్లలను కూడా వదలని కామందులు .... ఇంట్లో ఆడపిల్ల ఉంటే ప్రతి తండ్రి చస్తూ బ్రతకాలిసిందేనా..... స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఆడవారికి మాత్రం దొరకని స్వేచ్ఛ
🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్ నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటేనే ఒక భయం, పెంచాలంతే ఒక ఆందోళన నెలకొంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సమాజమే కాటేసే మృగంగా మారుతుంటే, ఆడపిల్లలకు అసలు భద్రత ఎక్కడ ఉంది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. నిత్యం వార్తాపత్రికలు తిరగేసినా, టీవీ ఛానళ్లు చూసినా పసిపిల్లలపై జరుగుతున్న దారుణాలు మనస్సున్న ప్రతి మనిషిని కలచివేస్తున్నాయి.మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్న కామందులు, కనీసం మాట్లాడడం కూడా రాని పసిపిల్లలను కూడా వదలడం లేదు. ఐదేళ్ల లోపు బాలికలపై కూడా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారంటే, ఈ సమాజం ఎంతటి పతనస్థితికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. మద్యం మహమ్మారి మనుషుల్లోని నైతికతను చంపేసి, వారిని రాక్షసులుగా మారుస్తోంది.ఇంట్లో ఆడపిల్ల ఉంటే ప్రతి తండ్రి ప్రతిరోజూ చస్తూ బ్రతకాల్సిందేనా? కూతురు బడికో, కాలేజీకో, కనీసం ఇంటి పక్కన ఉన్న దుకాణానికో వెళ్తే… క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంటి నిండా నిద్ర కరువై, నిరంతరం భయంతో బ్రతకడం ఏ రకమైన జీవనం?దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా, సగభాగంగా ఉన్న ఆడవారికి మాత్రం నేటికీ స్వేచ్ఛ దొరకడం లేదు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్న మహాత్ముడి మాటలు కల్లలుగానే మిగిలిపోయాయి. నేడు పగటిపూట కూడా ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్లలేని దుస్థితి దాపురించింది.చట్టాలు కాగితాలకే పరిమితం కాకుండా, తప్పు చేసిన వారికి తక్షణమే కఠినమైన శిక్షలు పడినప్పుడే ఇలాంటి మృగాల్లో భయం పుడుతుంది. మద్యం అమ్మకాలపై నియంత్రణ, సమాజంలో నైతిక విలువల పెంపుదల, తక్షణ న్యాయం ద్వారానే మన ఆడబిడ్డలకు నిజమైన రక్షణ లభిస్తుంది.— మీ….. చిక్కం గోపాలకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *