వెయ్యి రోజుల పాలన.. అన్ని అబద్ధాలే..!.

ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు..?. కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ధ్వజం.
🖨️ Print

జనం న్యూస్ 02 సెప్టెంబర్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి :షాద్‌నగర్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు వై. అంజయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బుధవారం షాద్‌నగర్ పట్టణ కూడలిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక కూడా ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా భారీ హామీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రజలను తప్పుదారి పట్టించిందని అంజయ్య యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఆరు గ్యారెంటీల్లో అనేక హామీలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వికలాంగులకు రూ.6 వేల పింఛన్, పింఛన్ల పెంపు, రైతుబంధు మొత్తాన్ని పెంచడం వంటి హామీలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.200గా ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిందని, తాము అధికారంలోకి వస్తే దానిని రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. ప్రభుత్వం దిగివచ్చి హామీలను అమలు చేసే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంజయ్య యాదవ్ హెచ్చరించారు. గులాబీమయమైన షాద్‌నగర్ చౌరస్తాఅంజయ్య యాదవ్ పిలుపుతో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో షాద్‌నగర్ పట్టణ కూడలి గులాబీమయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ 420 హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, వి. నారాయణరెడ్డి, ఎమ్మె సత్యనారాయణ, వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, నరేందర్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, మాజీ స్త్రీ, శిశు సంక్షేమ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, అలాగే మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ వైస్ ఎంపీపీలు, బీఆర్ఎస్ మండల, గ్రామ, మున్సిపాలిటీ, వార్డు అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *