జనం న్యూస్, జూలై 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. పార్టీ విస్తరణతో పాటు యువతను మరింతగా ఆకర్షించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కైతలపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలికోట శంకర్‌ను నియమించింది. గతంలో కూకట్పల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన కలికోట శంకర్, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పై పోరాటాలు, యువతను సంఘటితం చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. శంకర్ నియామకంతో కైతలపూర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో త్వరలో బూత్ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కలికోట శంకర్ నియామకం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.