కొత్తమ్మ తల్లి ఆలయంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం.

జనం న్యూస్ జూలై 2 కోటబొమ్మాళి మండలం : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి స్థానిక శ్రీ కొత్తమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. తాజాగా గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 500 మంది భక్తులు హాజరు కావడం విశేషం. అమ్మవారి ఆలయానికి కూడా భక్తుల తాకిడి రోజు రోజుకి పెరుగుతుంది. నిత్యం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వస్తున్నారు. అయితే ఈ అన్నదాన కార్యక్రమం నిత్యం కొనసాగేలా కృషి చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. తల్లి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా కోరిన కోర్కెలు తీర్చే కొత్తమ్మ తల్లి కడుపు నింపి పంపిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో ఊరకనిస్తుంది అని చెప్పక తప్పదు. గురువారం నాటి అన్నదాన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి వాకచర్ల రాధాకృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షులు కోరాడ గోవిందరావు, సభ్యులు మంచాల వెంకట్రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *