జనం న్యూస్ ప్రతినిధి, 30జూన్ 2026 అశ్వారావుపేట: అవినీతికి అలవాటు పడిన కొందరు అధికారులు ఏసీబీ పేరును కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని మరోసారి ఈ ఘటన నిరూపించింది. చెరువు మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వాలంటే భారీ మొత్తంలో లంచం ఇవ్వాల్సిందేనని రైతును వేధించిన ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) చివరకు ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈఈగా పనిచేస్తున్న ఎల్. శ్రీనివాస్‌ను సోమవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన పొలానికి చెరువు మట్టిని తరలించేందుకు అనుమతి కావాలని ఓ రైతు కొద్ది రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే అనుమతి ఇవ్వాలంటే రూ.4 లక్షలు ఇవ్వాలని ఏఈఈ శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు పలుమార్లు వేడుకున్నప్పటికీ అధికారి ఏమాత్రం తగ్గకపోవడంతో చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉండగా, లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, పక్కా ప్రణాళికతో సోమవారం రాత్రి అశ్వారావుపేట కార్యాలయంలో ఉచ్చుపన్నారు. ఏసీబీ సూచనల మేరకు బాధిత రైతు రూ.2 లక్షల నగదును ఏఈఈ శ్రీనివాస్‌కు అందజేశాడు. డబ్బును స్వీకరించిన అధికారి వాటిని తన డెస్క్‌లో పెట్టుకున్న వెంటనే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏఈఈ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఏసీబీ పేరు చెప్పినా వెనక్కి తగ్గని అధికారి ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు గతంలో తాను ఓ అధికారిని ఏసీబీకి పట్టించానని, లంచం ఇవ్వబోనని హెచ్చరించినప్పటికీ ఏఈఈ శ్రీనివాస్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదని తెలిసింది. “లంచం ఇస్తేనే అనుమతి ఇస్తా” అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా, చెరువుల నుంచి మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వడంలో ఇతర రైతుల వద్ద నుంచి కూడా లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో అశ్వారావుపేట ప్రాంతంలో అవినీతి వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.