మౌలిక సదుపాయాల లేమితో జగనన్న కాలనీ ప్రజల ఆవేదన

జనం న్యూస్ జూన్ 30 (రిపోర్టర్ రాజు): అనంతపురం జిల్లా వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో (గవర్నమెంట్ లేఅవుట్స్)నెలకొన్న త్రాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి, వీధి దీపాల కొరత తదితర మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబాలు తీవ్రమైన త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాలనీలో అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వర్షం పడితే బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీధి దీపాలు సరిగా లేకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు సంచరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జగనన్న కాలనీకి (ప్రభుత్వ లేఔట్స్) అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ జయశ్రీ కి, ఎంపీడీఓ శివ నాగజ్యోతి కి వినతిపత్రం అందజేసి, త్రాగునీటి సమస్యతో పాటు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో జగనన్న కాలనీ పెద్దలు మరకట్ట శీన, షేక్షావలి,ఎర్రిస్వామి, ఇల్లూరు శీన, సురేష్, బాల సుంకన్న, గురు స్వామి, కిష్టా, నెట్టికంటయ్య, పాండురంగడు,అబ్దుల్, ప్యాపిలి అంజనేయ, సామాజికవేత్త బెంజిమెన్ మహిళలు, యువకులు, వృద్ధులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *