ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న పవర్ స్టార్

జనంన్యూస, ౦౩ మే: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురికావడంతో శస్త్ర చికిత్స జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ అసాధారణమైన ధైర్యశాలి అని మోడీ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ చాలా త్వరలోనే కోలుకుంటారనే పూర్తి నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలియజేస్తూ ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్టు చేశారు.

మోడీకి థ్యాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ప్రధాని నరేంద్రమోడీ తనకు ఫోన్ చేసిన తన ఆరోగ్యం గురించి ఆరా తీయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారుజ ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… నా శస్త్రచికిత్స తర్వాత మీరు నాతో స్వయంగా మాట్లాడినందుకు, ఆత్మీయంగా పలకరించినందుకు, నా ఆరోగ్యం అడిగి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చూపెట్టిన ఆత్మీయత, ప్రోత్సాహం, నేను త్వరగా కోలుకోవాలని మీరు శుభాకాంక్షలు తెలుపడం నాకు గొప్ప బలాన్ని ఇస్తున్నాయి. మీ నిరంతర మార్గదర్శకత్వం, మద్దతు, నేను త్వరగా కోలుకోవాలని మీరు శుభాకాంక్షలు తెలియజేసినందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను’’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 18న ఆపరేషన్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు శస్త్రచికిత్స జరిగింది.హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఏప్రిల్ 18న శనివారం సాయంత్రం వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వచ్చేందుకు కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అని వైద్యులు వెల్లడించారు. ఇకపోతే గత కొంతకాలంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పాలనాపరమైన విషయాలపై చర్చిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

అపోలో ఆస్పత్రిలో చికిత్స: ఇకపోతే అపోలో ఆస్పత్రి వైద్యులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరీక్షించి వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ధారించారు. దీంతో శస్త్రచికిత్స పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. 10 రోజుల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ వివరాలను జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *