జనం న్యూస్ , మే 02, మసాయిపేట్, ప్రతినిధి మొహమ్మద్ ముజామిల్ నార్సింగి పోలీస్ స్టేషన్‌ను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేసి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా సమగ్ర భద్రత కల్పించాలని పేర్కొన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలని, తెలియని కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని, మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, స్థానికుల సహకారంతో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ తెలిపారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్ఐ సృజన, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.