ఈఎంఐ తగ్గించడం అంటే రుణ చెల్లింపు కాలాన్ని పొడిగించడమే…?

*తక్కువ ఈఎంఐ, తగ్గే వడ్డీ భారం, రుణ నిబంధనలు ఆకర్షణీయం *వడ్డీ రేటు ఒక్కటేనా?… అవును ఒక్కటే…? *అదనంగా చెల్లించే వడ్డీ భారం వల్ల బదిలీ ద్వారా దక్కిన ఆర్థిక ప్రయోజనం తక్కువే..! *గృహరుణం బ్యాంకు మారుతున్నారా?

జనం న్యూస్ జూన్ 28 (రవీంద్ర) వికారాబాద్ బ్యూరో తక్కువ వడ్డీ రేటు అనగానే ఎవరికైనా ఇంటి రుణం బదిలీ చేసుకోవాలనే ఆసక్తి కలగడం సహజం. దీనివల్ల నిజంగా డబ్బు ఆదా అవుతుందా? లేదా? అనేది బదిలీకయ్యే ఖర్చులు, మారే సమయం, మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్లుగా వాయిదాలు చెల్లిస్తున్న వారికి, వేరే బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు అనగానే లాభంలా కనిపిస్తుంది. తక్కువ ఈఎంఐ, తగ్గే వడ్డీ భారం, మెరుగైన రుణ నిబంధనలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా మీ రుణం తీర్చేందుకు ఇంకా చాలా ఏళ్ల వ్యవధి ఉన్నప్పుడు రుణ బదిలీ మంచి వెసులుబాటుగా అనిపిస్తుంది. కేవలం ప్రకటనల్లో కనిపించే వడ్డీ రేట్లనే చూసి, గృహరుణాన్ని మార్చుకునే నిర్ణయం తీసుకోకూడదు. బ్యాంకు మారే ముందు, అన్ని ఖర్చులూ కలిపాక నిజంగా మీకు డబ్బు ఆదా అవుతుందో లేదో సరిచూసుకోవాలి. వడ్డీ రేటు ఒక్కటేనా? రుణ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు కాస్త తగ్గినా గణనీయమైన పొదుపు సాధ్యమవుతుంది. కానీ, తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నంత మాత్రాన, అది మంచిదేమీ కాకపోవచ్చు. ఎందుకంటే, కొత్తగా రుణం అందించే ఆర్థిక సంస్థ ప్రాసెసింగ్‌ ఛార్జీలు, న్యాయ పరిశీలనా రుసుములు, విలువ లెక్కింపు ఫీజులవంటి అదనపు ఖర్చులను విధించవచ్చు. పాత, కొత్త వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం లేనప్పుడు ఈ అదనపు ఛార్జీల వల్ల మీకు దక్కే ప్రయోజనం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, వడ్డీ రేటును మాత్రమే కాకుండా, రుణానికి అయ్యే మొత్తం ఖర్చును పరిగణనలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం. సరైన సమయంలోనే గృహరుణాన్ని ప్రారంభంలోనే వేరే బ్యాంకుకు మార్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రుణం తీసుకున్న కొత్తలో చెల్లించే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. ఈ దశలో వడ్డీ రేటును తగ్గించుకుంటే, పొదుపూ భారీగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఏళ్లుగా ఈఎంఐలు చెల్లించి, అప్పు తీరిపోయే దశకు చేరుకుంటే మాత్రం, వడ్డీలో చాలా భాగం ఇప్పటికే చెల్లించేసి ఉంటారు. కాబట్టి, బ్యాంకు మారినా మీకు కలిగే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. బ్యాంకు మారే ముందు మిగిలిన రుణ కాలపరిమితిలో వాస్తవంగా ఎంత మొత్తం ఆదా అవుతుందో లెక్కించుకోవాలి. ఖర్చులు విస్మరించొద్దు చాలామంది రుణగ్రహీతలు కేవలం తగ్గే ఈఎంఐని మాత్రమే చూస్తారు. కానీ, రుణాన్ని వేరే బ్యాంకుకు మార్చేందుకు అయ్యే అదనపు ఖర్చులను మర్చిపోతారు. బ్యాలెన్స్‌ బదిలీ ప్రక్రియలో కొత్తగా కాగితం పని, డాక్యుమెంట్ల పరిశీలన ఇలా ఎన్నో ఖర్చులు ఇమిడి ఉంటాయి. చలన వడ్డీ రేటు ఉన్న గృహరుణాలపై ముందస్తు చెల్లింపు రుసుములు ఉండవు. బదిలీ సంబంధిత ఖర్చులన్నీ చెల్లించిన తర్వాత కూడా, ఈ మార్పును సమర్థించుకునేంత స్థాయిలో తగినంత పొదుపు అవుతుందా లేదా అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఒకేలా ఉండవు.. తక్కువ వడ్డీ రేట్లను చూపిస్తూ వచ్చే ప్రకటనలను చూసిన వెంటనే చాలామంది రుణ బదిలీ కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదైనా బ్యాంకు 7.5% లేదా 8శాతం వడ్డీ రేటును ప్రకటిస్తే, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అదే రేటు వర్తిస్తుందని అనుకోవడం పొరపాటు. వాస్తవానికి, మీకు లభించే వడ్డీ పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. రుణం తీసుకున్నప్పటి నుంచి మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహిస్తున్నారో కొత్త బ్యాంకు పరిశీలిస్తుంది. ఈఎంఐలు సకాలంలో చెల్లించారా? ఏమైనా ఇతర రుణాలు తీసుకున్నారా? ఆదాయం పెరిగిందా? లేదా ఆర్థిక పరిస్థితి మారిందా? అనే అంశాలను బేరీజు వేస్తుంది. చెల్లింపుల చరిత్ర బలంగా ఉండి, క్రెడిట్‌ స్కోరు 800లకు పైగా ఉన్నప్పుడే మీకు బేరమాడే శక్తి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటికంటే తగ్గితే మాత్రం, మిమ్మల్ని ఆకర్షించిన వడ్డీ రేటు మీకు లభించకపోవచ్చు.* ఈఎంఐని చూస్తే.. కొత్త బ్యాంకుకు మారడం వల్ల మీ నెలవారీ ఈఎంఐ తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న ప్రతికూల అంశం ఏమిటంటే, ఈఎంఐ తగ్గడానికి కారణం మీ రుణ చెల్లింపు కాలాన్ని పొడిగించడమూ కావచ్చు. దీనివల్ల ప్రతి నెలా మీపై పడే ఆర్థిక భారం తగ్గినట్లు అనిపించినా, రుణం తీర్చడానికి ఎక్కువ సమయం పడుతుంది, తద్వారా దీర్ఘకాలంలో ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. అందుకే కేవలం తగ్గిన ఈఎంఐని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. ప్రస్తుతం నెలవారీ వాయిదాలు తగ్గడం ఆకర్షణీయంగా అనిపించినా, రాబోయే పదేళ్లలో మీరు అదనంగా చెల్లించే వడ్డీ భారం వల్ల బదిలీ ద్వారా దక్కిన ఆర్థిక ప్రయోజనం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *