నిర్వాసితుల పేరుతో స్థానికేతర నాన్-ట్రైబల్స్‌కు కోట్ల రూపాయలు దోచిపెడుతున్న అధికారులు

పోలవరం జిల్లా ఆదివాసి సక్షేమ పరిషత్ తీవ్ర ఆగ్రహం

జనం న్యూస్ /జూన్ 28/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ :సోమరాజు నడపాల పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్యాకేజీల పంపిణీలో చింతూరు ఐటీడీఏ పరిధిలో, ముఖ్యంగా వి.ఆర్.పురం మండలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆదివాసి సక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు కూర చిట్టిబాబు తీవ్రంగా మండిపడ్డారు. శనివారం నాడు వి.ఆర్.పురం మండలం గుర్రంపేట గ్రామంలో ఆదివాసి సక్షేమ పరిషత్ కార్యకర్తలతో నిర్వహించిన ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కూర చిట్టిబాబు మాట్లాడుతూ, తరతరాలుగా ఏజెన్సీ ప్రాంతంలోనే నివసిస్తూ భూములు కోల్పోయిన అసలైన ఆదివాసులకు మాత్రం పోలవరం ప్యాకేజీలు సకాలంలో అందడం లేదని, దానికి భిన్నంగా స్థానికేతరులకు, వలస వచ్చిన నాన్-ట్రైబల్స్ (ఆదివాసియేతరులు) కు అధికారులు లంచాలు, కమిషన్లకు కక్కుర్తి పడి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కట్టబెడుతున్నారని ఆరోపించారు.వలసదారులకే పెద్దపీట: ఏజెన్సీలో నివాసం లేని వారికి, చివరికి విదేశాలలో స్థిరపడిన నాన్-ట్రైబల్స్ కుటుంబాలకు సైతం చట్ట విరుద్ధంగా ఇక్కడ ప్యాకేజీలు మంజూరు చేయడం దారుణం.
భూ ఆక్రమణదారులకు లబ్ధి: చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి కూడా అధికారులు ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నారు. 1/70 చట్టం ఉల్లంఘన: ఏజెన్సీ ప్రాంత రక్షణ చట్టమైన ‘1/70 చట్టాన్నీ కాలరాస్తూ, అర్హత లేని వేలాది మంది నాన్-ట్రైబల్స్ పేర్లను నిర్వాసితుల జాబితాలో చేర్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇలా ప్యాకేజీలు పొందిన స్థానికేతరులు మళ్లీ ఆ భూములను కౌలుకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.తక్షణమే నిలుపుదల చేయాలి. చింతూరు డివిజన్ ముఖ్యంగా వి.ఆర్.పురం మండలంలో అక్రమంగా సాగుతున్న ఈ పోలవరం ప్యాకేజీల ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఆదివాసి సక్షేమ పరిషత్ నాయకులు, కార్యకర్తలు మొట్టుమ్ రాజు, కారం నాగయ్య, ఉయిక అంజినారావు, మొట్టుమ్ చందు, మొట్టుమ్ సురేష్, మొట్టుమ్ మల్లయ్య, కారం కామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *