జనం న్యూస్, జూన్ 29(జిల్లా ఇంచార్జ్ ) జమ్మికుంట మండలం మడిపెల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన మొగిలి హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలిందని హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. ఈ కేసులో నిందితుడు గంగారపు మహేష్‌ను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న దుస్తులు, హత్యకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో శోధించిన మొబైల్ ఫోన్, ఘటనలో ఉపయో గించిన మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. తన వ్యవసాయ భూమి సమీపంలో వ్యవసాయం చేస్తున్న ఓ వివాహితతో నిందితుడికి పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో మృతుడు పైతరి మొగిలి ఆ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడగా, ఆమెతో పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు నిందితుడు తెలిపాడు. ఆ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత మృతుడు తనను తరచూ అవమానిస్తూ, దూషిస్తూ ఉండేవాడని, కుటుంబాల్లో విభేదాలకు కూడా అతడే కారణమని భావించి హత్యకు పథకం రచించినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.ఈ నెల 27న పీర్ల పండుగకు గ్రామానికి వచ్చిన మృతుడిని గమనించిన నిందితుడు, ముందుగానే యూట్యూబ్‌లో హత్యలకు సంబంధించిన వీడియోలు, ఆయుధాల వినియోగంపై సమాచారం వెతికినట్లు వెల్లడించాడు. అనంతరం ఇంటి నుంచి ఇనుప రాడ్ తీసుకుని గ్రామ శివారులో మద్యం సేవించిన తర్వాత రాత్రి సుమారు 11.45 గంటలకు అంకుశాపూర్ వెళ్లే రోడ్డుపై సైకిల్‌పై వెళ్తున్న మొగిలిపై వెనుక నుంచి ఇనుప రాడ్‌తో దాడి చేశాడని తెలిపారు. కిందపడిన అనంతరం తల, ముఖంపై పలుమార్లు బలంగా కొట్టి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడన్నారు. హత్య అనంతరం ఇనుప రాడ్‌ను తన వ్యవసాయ బావి సమీపంలో పడవేసి, ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు నిందితుడు వెల్లడించాడని ఏసీపీ తెలిపారు. కేసులో మరిన్ని దర్యాప్తు చర్యలు కొనసాగుతున్నాయని హుజురాబాద్ ఏసీపీ మాధవి వెల్లడించారు.