ముందస్తు సమాచారం ఏది..?

* గుమ్మ గ్రామసభపై స్థానికుల తీవ్ర అసంతృప్తి..!

జనం న్యూస్, జులై 02, అల్లూరి జిల్లా ప్రతినిధి గోపిరెడ్డి : అనంతగిరి మండల పరిధిలోని గుమ్మ గ్రామపంచాయతీ సచివాలయంలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర వివాదాస్పదంగా మారింది. సభ నిర్వహణ తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమాచార లోపం.. వెలవెలబోయిన సభ గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి శైలజ అధ్యక్షత వహించి వివిధ అజెండా అంశాలపై మాట్లాడినప్పటికీ, సభకు హాజరైన వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామాలకు ముందస్తుగా ఎలాంటి సమాచారం అందించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రజలు మండిపడుతున్నారు. కేవలం ఒక వాట్సాప్ గ్రూపులో మాత్రమే సందేశం పంపి చేతులు దులుపుకున్నారని, దీనివల్ల అత్యధిక శాతం మంది గ్రామస్థులకు సభ గురించిన సమాచారమే తెలియకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు. వచ్చి వెళ్లిన స్పెషల్ ఆఫీసర్.. అంతుచిక్కని ఫిర్యాదుల స్వీకరణ గ్రామసభకు ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) వస్తారని ముందుగా చెప్పినప్పటికీ, ఆయన వచ్చి వెళ్లిన విషయం కూడా సామాన్య ప్రజలకు తెలియ కుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజల సమస్యలను వినకుండా, సరైన సమాచారం ఇవ్వకుండానే అధికారి వచ్చి వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల నుంచి కనీసం ఫిర్యాదులు కూడా స్వీకరించడం లేదు. అధికారుల హాజరు, వారి విధుల నిర్వహణపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. — స్థానిక గ్రామస్థులు ఉన్నతాధికారులు స్పందించాలి.. గ్రామసభల నిర్వహణలో కనీస పారదర్శకత లోపించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, భవిష్యత్తులో నిర్వహించే గ్రామసభల సమాచారాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ముందస్తుగా అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *