అధికారుల నిర్లక్ష్యానికి ఆదివాసి చిన్నారి బలి : ఎ.ఎస్.పి

- తప్పించుకునేందుకు కలెక్టర్ ‘వ్యాధుల నెపం’ నాటకాలు - వైద్యుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుతూ, మృతులపై నిందలు వేస్తారా? - పోలవరం కలెక్టర్ వ్యాఖ్యలపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను తీవ్ర ఆగ్రహం
🖨️ Print

జనం న్యూస్/సెప్టెంబర్ 03/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల ఎన్సీ ఎస్టీ కి అధికారికంగా ఫిర్యాదు జారీ (డైరీ నెంబర్ : 77139/ఐఎన్/2026) విచారణలో నిజాన్ని తేలుస్తాం!పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ముందస్తు వైద్య పరీక్షలు లేకుండా ఇష్టానుసారంగా క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసి, 7 ఏళ్ల ఆదివాసి చిన్నారి మడివి జమున మరణానికి మరియు 53 మంది ఆదివాసీలు ఆసుపత్రి పాలు కావడానికి కారణమైన వైద్యాధికారులను కాపాడేందుకు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కలెక్టర్ విడుదల చేసిన పత్రికా ప్రకటన కేవలం పరిపాలనా వైఫల్యాల నుండి తప్పించుకోవడానికి మరియు ఆదివాసీల ప్రాణాలకు విలువ లేకుండా చేయడానికి ఆడుతున్న నాటకమని ఆయన మండిపడ్డారు.పోస్టుమార్టం నివేదిక మరియు వైజాగ్ ఫొరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రాకముందే, మృతి చెందిన చిన్నారి జమునకు “జన్యుపరమైన గుండె సమస్యలు ఉండవచ్చు” అంటూ కలెక్టర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అధికారుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికేనని కుంజ శ్రీను విమర్శించారు. ఎటువంటి ముందస్తు స్క్రీనింగ్ లేకుండా, సికిల్ సెల్ ఎనీమియా లేదా ఇతర కొమార్బిడిటీలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండానే చిన్నారులకు అంత పెద్ద మొత్తంలో డోసేజ్ మాత్రలు ఇవ్వడం వైద్య నేరం కాదా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత ఊరంతటికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని కలెక్టర్ చెప్పడమే, అంతకుముందు వైద్య సిబ్బంది ఎలాంటి నిబంధనలు పాటించకుండా అశాస్త్రీయంగా మాత్రలు పంపిణీ చేశారనే దానికి స్పష్టమైన ఆధారమని స్పష్టం చేశారు.ఈ ఘోర వైద్య అక్రమాన్ని మరియు యంత్రాంగం చూపిస్తున్న తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇప్పటికే జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా, కమిషన్ ఈ ఫిర్యాదును అధికారికంగా స్వీకరించి డైరీ నెంబర్: 77139/ఐఎన్/2026 కేటాయించిందని తెలిపారు. కలెక్టర్ చెప్తున్న కట్టుకథలను కమిషన్ ముందు ఎండగడతామని, చిన్నారి మృతికి కారణమైన వైద్యాధికారులు, సిబ్బందిపై బిఎన్ఎస్,ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు, బాధితులకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని కుంజ శ్రీను హెచ్చరించారు. అవసరమైతే బాధితుల తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *