జనం న్యూస్ చింతూరు మండల రిపోర్టర్ శీలం తమ్మయ్య జూన్ 27. ఎటపాక మండలం లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం లో భాగంగా సుప్రీంకోర్టులో 1/70 చట్టానికి వ్యతిరేకంగా, ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా సుమారు 1700 మంది గిరిజనేతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం భద్రాచలం కేంద్రంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను పాల్గొని ప్రసంగిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా గట్టి అల్టిమేటం జారీ చేశారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ‘జీవో నెంబర్ 3’ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యం వల్ల, అలాగే ఆదివాసి ప్రజాప్రతినిధుల చేతకానితనం, నిస్సహాయత వల్లనే సుప్రీంకోర్టులో ఆ జీవో కొట్టివేయబడిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఇదే ధోరణితో ప్రస్తుత పాలకులు సైతం కేవలం గిరిజనేతరుల ఓట్ల కోసం, ఏజెన్సీ ప్రాంతాలలో వారిని పెంచి పోషించి అన్ని రకాల హక్కులు కల్పించాలనే కుట్రపూరిత ఆలోచనతో ఉన్నారని, అందులో భాగంగానే ఉమ్మడిగా 1/70 చట్టాన్ని (భూ బదలాయింపు నిరోధక చట్టం) రద్దు చేయడానికి తెరవెనుక కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి, ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా 1700 మంది వేసిన ఈ కేసుపై సుప్రీంకోర్టులో అత్యంత బలీయమైన ‘కౌంటర్ అఫిడవిట్’ దాఖలు చేయాలని, ఆ పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు తమ ఐక్యతను చాటాల్సిన క్లిష్ట సమయం ఆసన్నమైందని, ఇప్పుడు కూడా “నా రాజకీయ పార్టీ, నా నాయకుడు” అంటూ స్వార్థంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా విడిపోతే భవిష్యత్తులో ఆదివాసుల మనుగడ, ఉనికి తీవ్ర ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టం రద్దు వెనుక ఉన్న ఈ భారీ కుట్రలను తిప్పికొట్టాలంటే ఆదివాసి సమాజం అంతా కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వివిధ రాజకీయ పార్టీలలో పదవుల్లో కొనసాగుతున్న ఆదివాసి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఆయా పార్టీలకు ఊడిగం చేయడం మానేసి, తమ జాతికి గుండెకాయ లాంటి 1/70 చట్టానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూల్డ్ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాలలో చట్ట సవరణల పేరుతో అడుగుపెట్టడం అంటే ఆదివాసులను నిలువునా పూడ్చిపెట్టడమేనని, ఈ కుట్రలో భాగంగానే చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం లేదా రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ చట్టం రద్దయితే పాలకులకు, గిరిజనేతరులకు ఏజెన్సీలోని అపారమైన ఖనిజ సంపదను, విలువైన భూములను పూర్తిగా దోచుకునే చట్టబద్ధమైన హక్కు దొరుకుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులను మల్టీ నేషనల్ (బహుళజాతి) కంపెనీలకు అప్పజెప్పి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని అడవులను విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. భూములు అమ్ముకోవడానికి మరియు కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించాలనే దురాశతోనే గిరిజనేతరులు 1/70 చట్టాన్ని తొలగించాలని లేదా సవరించాలని కోర్టులను ఆశ్రయించారని, ఇది నేరుగా ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై జరుగుతున్న దాడేనని పేర్కొన్నారు. ఇదే గనుక జరిగితే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు నిలువ నీడ కూడా ఉండదని, అందుకే ప్రతి ఒక్కరూ “మేలుకో ఆదివాసి మేలుకో – ఏజెన్సీ కాపాడుకో.. నీ చట్టాలను కాపాడుకో” అంటూ గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులు కోర్స వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాసు, ఉపాధ్యక్షులు సోయం కామరాజు తెలుగు రాష్ట్రాల ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ముఖ్య నాయకులతో పాటు, ఆంధ్రప్రదేశ్ నుంచి పోలవరం జిల్లా అధ్యక్షులు కూర చిట్టిబాబు మరియు పలువురు ఆదివాసి ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.