కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట -కాంగ్రెస్ పాలన పై ప్రజల అసంతృప్తి

🖨️ Print

(జనం న్యూస్ ) 2 సెప్టెంబర్‌ ఘట్కేసర్‌ ప్రతినిధి : సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు ప్రతి గడపకు బాకీ కార్డులు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు మేడ్చల్‌ నియోజకవర్గంలో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఘట్‌కేసర్‌ సర్కిల్‌, ఘట్‌కేసర్‌ డివిజన్ ‌లోని అంబేద్కర్‌ కూడలి వద్ద మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల కార్యాచరణపై ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తుచేస్తూ, వాటి అమలులో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నెరవేర్చని హామీలు, పెండింగ్‌లో ఉన్న అంశాలను ‘బాకీ కార్డులు’ రూపంలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. డివిజన్‌ స్థాయి నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రతి గడపకు బాకీ కార్డులు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలపై ప్రజల తరఫున బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని మల్లారెడ్డి పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ, ప్రభుత్వ హామీలు–వైఫల్యాలను వివరిస్తూ ప్లెక్సీల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో తిరిగి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. నిరసన కార్యక్రమాల సందర్భంగా ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జెండాలు, ప్లెక్సీలతో ఘట్‌కేసర్‌ పట్టణంలో రాజకీయ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పోచారం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌ రెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయక్, సారా శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్‌, కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి, ఎస్‌.కె. జహంగీర్‌, బేతాళ నర్సింగరావు, సుర్వి రవీందర్‌ గౌడ్‌, బెజ్జంకి హరిప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్‌, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌ రెడ్డి, వరికుప్పల లింగస్వామి, నల్లవెల్లి శేఖర్‌ ముదిరాజ్‌, బద్దం జగన్మోహన్‌ రెడ్డి, బొక్క విష్ణువర్ధన్‌ రెడ్డి, సామల సందీప్‌ రెడ్డి, మాజీ కోఆప్షన్‌ సభ్యులు మొహమ్మద్‌ అక్రమ్‌ అలీ, అన్ను భాయ్‌, షబ్బీర్‌ అలీ ఖాన్‌, కేతావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌, రాజా నాయక్‌, మాజీ ఎంపీటీసీ మంకం రవి, చిలుకూరి మాకయ్య, మాజీ సర్పంచులు కొంతం వెంకట్‌ రెడ్డి, ఓరుగంటి వెంకటేష్‌ గౌడ్‌, శివకుమార్‌, చింతకింది వేణు, గోపాల్‌ రెడ్డి, అబ్బోల్ల నాగేష్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ సిరాజ్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *