చింతాడలో భారీ అగ్నిప్రమాదం.. 12 పశువుల పాకలు బుగ్గిపాలు

అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
🖨️ Print

జామి, సెప్టెంబర్ 02 (జనం న్యూస్ ప్రతినిధి రావాడ నాయుడు): విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు గ్రామంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలో 12 పశువుల పాకలు, 8 గడ్డి వాములు, 4 ధాన్యం పురులు పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే మంటలు ఉధృతంగా వ్యాపించాయి. దీంతో పశువుల పాకలు పూర్తిగా కాలిపోయాయి. ఏడాది పొడవునా కష్టపడి దాచుకున్న ధాన్యం, పశుగ్రాసం అగ్నికి ఆహుతవడంతో బాధిత రైతు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే స్పందించి నాలుగు వాటర్ ట్యాంకర్లను సమకూర్చి మంటలను అదుపు చేయించారు. అనంతరం బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. జరిగిన ఆస్తి నష్టంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వం తరఫున బాధిత రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుని, తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పశువుల పాకలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 12 బాధిత కుటుంబాలకు తక్షణమే ‘గోకుల షెడ్లు’ మంజూరు చేయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.విపత్తు సమయంలో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి తమకు అండగా నిలవడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జామి మండల పార్టీ అధ్యక్షుడు వర్రి రమణ, తెలుగు యువత అధ్యక్షుడు రాయవరపు శంకర్, రెడ్డి పైడి బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *