జనం న్యూస్ , జూన్ 30 ( జిల్లా ఇంచార్జ్ ) ప్రతి ఓటరికి ఓటు హక్కు కల్పించేలా ఓటరు సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని 4, 5, 19, 27, 28, 30 వార్డుల్లో బూత్ కోఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి సర్ కార్యక్రమం అమలు తీరును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని బిఎల్ఏలకు సూచించారు.అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి పది బూత్‌లకు ఒక కోఆర్డినేటర్ చొప్పున జమ్మికుంట పట్టణానికి నలుగురు కోఆర్డినేటర్లను నియమించామని, వారు ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. బిఎల్ఓలు ఇంటింటికీ వచ్చినప్పుడు బూత్ ఏజెంట్లు తప్పనిసరిగా పాల్గొని ఓటర్లకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన వారు, “ఇక్కడున్న ఎమ్మెల్యే కాంట్రవర్సీలకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించే ముందు గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తాము చేసిన పనులపై ఆత్మపరిశీలన చేసుకోవాలని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి కేంద్రంగా మార్చి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ పేదల ప్రభుత్వంగా ముందుకు సాగుతోందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ సర్ కోఆర్డినేటర్, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.