సమిష్టిగా పనిచేసి, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

★రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

జనం న్యూస్ మే 02 కోటబొమ్మాళి మండలం :పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో టెక్కలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 22 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఇంటికీ చేరుకుని ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించడం కార్యకర్తల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగుతోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి గడపకూ చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నాయకులుగా ఎదగగలరని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మరింత సమన్వయంతో పని చేస్తూ, అభివృద్ధే అజెండాగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అని అన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ. 650 కోట్లతో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు, ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులపై నాయకులతో కులంకుషంగా చర్చించారు. ప్రజల మన్ననలు పొందుతూ పార్టీ లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.