శత్రువులు సైతం అభినందించే గొప్ప నాయకుడు వైఎస్సార్.

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. షాద్‌నగర్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి.. నూతన విగ్రహం ఆవిష్కరణ.

జనం న్యూస్ 02 సెప్టెంబర్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి :షాద్‌నగర్: శత్రువులు సైతం అభినందించే గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొనియాడారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఫరూక్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన వర్ధంతి సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అని అన్నారు. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించారని గుర్తుచేశారు. భౌతికంగా ప్రజలకు దూరమై సంవత్సరాలు గడిచినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన సేవలు ప్రజల మనసుల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని అన్నారు.మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన మహానాయకుడు వైఎస్సార్. ఆయన యుగానికి ఒక్కడు” అని కొనియాడారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నాయని అన్నారు. వైఎస్సార్ భౌతికంగా ప్రజలకు దూరమైనా ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని, “సంక్షేమానికి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి” అని అన్నారు. వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన స్థానిక నాయకుడు ఇబ్రహీంను ప్రతాప్ రెడ్డి అభినందించారు. అనంతరం సమీపంలోని బాలికల పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మామిడి శ్యామ్‌సుందర్ రెడ్డి, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వాం, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ గిరిజన విభాగం కోఆర్డినేటర్ రఘు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం, జమ్రుద్ ఖాన్, కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు చల్ల శ్రీకాంత్ రెడ్డి, జితేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పలువురు మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నేతలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.