జనం న్యూస్ , జూలై 2 ( జిల్లా ఇంచార్జ్ ) మానవత్వాన్ని చాటుతూ వెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు సభ్యుడు బండారి ప్రశాంత్ ఓ నిరుపేద వృద్ధురాలికి అండగా నిలిచారు. గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు పక్కన తాత్కాలిక గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాలు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి సహాయం అందించారు. వర్షాకాలంలో గుడిసె పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో వర్షపు నీరు లోపలికి చేరి వృద్ధురాలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు సమాచారం అందడంతో, బండారి ప్రశాంత్ స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం స్వంత ఖర్చుతో తాడిపత్రిని కొనుగోలు చేసి గుడిసెకు కొత్త కవరింగ్ ఏర్పాటు చేయించి, వర్షపు నీరు లోపలికి రాకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధురాలిని పరామర్శించిన ఆయన, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. తన కష్టకాలంలో అండగా నిలిచిన బండారి ప్రశాంత్కు వృద్ధురాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు."ప్రజాసేవే లక్ష్యం – ప్రజల సంక్షేమమే ధ్యేయం" అనే భావనతో బండారి ప్రశాంత్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు ప్రశంసించారు. ప్రజాప్రతినిధిగా సమస్య తెలిసిన వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్న ఆయనను స్థానికులు అభినందించారు.