ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

★స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

జనం న్యూస్ మే 2 వికారాబాద్ బ్యూరో, ప్రభుత్వ సంక్షేమ పథకాలూ ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక వికారాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా SP స్నేహ మెహ్రా, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను ఇచ్చిందన్నారు. సమస్యల పరిష్కారంతో పాటుగా మన ప్రభుత్వం వచ్చాక మీకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటుగా అదే సమయంలో ప్రజల అవసరాలను స్థానికంగా తెలుసుకుని త్వరితంగా పరిష్కరించడం ఈ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లక్ష్యం అన్నారు. మన ప్రజా ప్రభుత్వం వచ్చాక గత రెండున్నర సంవత్సరాల లో పనులు చేయలేదని ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి పని చేసి పది రూపాయల ప్రచారం చేసుకున్నారని, మేము వంద రూపాయల పనిచేసి రూపాయ ప్రచారం చేసుకోవడం లేదన్నారు. ఉదాహరణకు గత ప్రభుత్వం పదేళ్ళలో మన వికారాబాద్ నియోజకవర్గం లో కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు, ఉన్నవి రిపేరు చేయలేదు. నేను గత రెండున్నర సంవత్సరాలలో 600 కోట్లతో రోడ్లు వేయించాను. ప్రతి గ్రామంలో 50 లక్షలతో సిసి రోడ్లు వేయించా. మేము పనిచేస్తున్నాం, అప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకున్నారని ఆయన తెలిపారు. వాళ్ళ పదేళ్ళ పాలనలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని, రాష్ట్రాన్ని మాత్రం వందేళ్లు వెనుకకు వేశారని,గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. గత ముఖ్యమంత్రి చేసిన ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే అగుపడుతున్నాయని చేసిన పనులు మాత్రం ఎక్కడా కనబడటం లేదన్నారు. ఈ అప్పులతో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని,నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడు కాబట్టి ఈ అప్పులను తీర్చుతూ మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నాడన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మీ పథకంలో మా అక్కా చెల్లెల్లకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ఇస్తున్నాం, గృహజ్వోతి పథకంలో పేదల ఇళ్ళకు ఉచితంగా కరంటు వస్తుంది, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంచామన్నారు. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది, సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు అంటూ పదేళ్ల పాటు పేదలను మోసం చేశారని,ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని, ప్రవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ హాస్టళ్ల పిల్లలకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. ఈ ఏడాది నుండి రాష్ట్రంలోని కుటుంబాలన్నింటికి భరోసా ఉండాలనే ఉద్యేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, బడికి వెళ్ళే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, ఆకలితో ఉండొద్దనే ఉద్యేశంతో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉదయం పూట అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిదంగా ఇంటర్ మీడియట్ విద్యార్ధులకు కూడా మద్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతిని తీసుకొచ్చామని,తొంబై ఏళ్ళ తరువాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను రీసర్వే చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు లేకపోతే మన ప్రభుత్వంలో తులం బంగారం వచ్చేది, మా అక్కా చెల్లెల్లకు నెలకు 2,500 రూపాయలు వచ్చేవి, పెన్షన్లు పెరిగేమన్నారు. కేవలం రెండున్నర సంవత్సరాలలోనే ఇన్ని పనులు చేశాం. ప్రజలు మంచి ఆలోచన పరులు, ఎవరు ప్రచారం చేసుకుంటారు, ఎవరు పనులు చేస్తారనేది తెలుసుకుని ఆదరిస్తారు. వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇది పదేళ్ళు ఉండే ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో మేము ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం అని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మీ గ్రామాలు, కాలనీలలోని ప్రజలకు తెలియజేయాలని గ్రామ సర్పంచ్ లకు, మున్సిపల్ కౌన్సిలర్లలకు నా సూచన. మనం చేస్తున్న పనుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజ పాలన- ప్రగతి ప్రణాళిక ఇందుకు సరైన వేదిక అన్నారు. వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వ సమావేశాలకు హాజరు కావాలన్నారు. మన నియోజకవర్గంలో 200 కోట్లతో 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీ నిర్మాణం వేగంగా జరుగుతున్నధని, ప్రతి మండలంలో ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది, అందులో భాగంగా ఇప్పటికే మర్పల్లి మండల కేంద్రానికి ఒక పబ్లిక్ స్కూల్ మంజూరు అయిందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ZP CEO సుదీర్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య గారు, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, వికారాబాద్, మర్పల్లి AMC చైర్మన్లు చాపల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.