పిట్లంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశం…

★సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే దృష్టి

జనం న్యూస్ మే 3 పిట్లం : పిట్లం మండలం రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత (పింఛన్లు), రేషన్ మరియు ఆహార భద్రత పథకాలు, విద్యుత్ సబ్సిడీలు వంటి అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.అలాగే జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 35 వేల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ మరియు ఎల్ఓసి ద్వారా దాదాపు 35 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పిట్లం మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, బిచ్కుంద మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఏఎంసీ చైర్మన్లు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.