జగద్గిరిగుట్ట కాకతీయ హైస్కూల్లో పదవ తరగతి 2026 పరీక్ష ఫలితాల్లో ప్రభంజనం

జనం న్యూస్ మే 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జగద్గిరిగుట్టలోని కాకతీయ హైస్కూల్ సాధించిన విజయం ప్రత్యేకంగా నిలిచింది. పదవ తరగతి 2026 పరీక్ష ఫలితాల్లో ఈ విద్యాసంస్థ మరొకసారి తన ప్రతిభను ఘనంగా చాటింది. ఎప్పటిలాగే అగ్రస్థానాల్లో నిలిచే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి చరిత్రలోనే మొదటిసారి 583 మార్కులు సాధించి విద్యార్థిని దొగిపర్తి దేదీప్య అద్భుత ప్రతిభను కనబరిచింది. ఆమె సాధించిన ఫలితం పాఠశాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ద్వితీయ స్థానంలో నిలిచిన పద్దాని వెన్నెల 561 మార్కులు సాధించి తన ప్రతిభను రుజువు చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో నిర్వహించిన సత్కార కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ప్రథమ స్థానం సాధించిన దేదీప్యతో పాటు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, నాగమణిలను ఘనంగా సన్మానించారు. అలాగే ద్వితీయ స్థానం పొందిన వెన్నెలతో పాటు ఆమె తల్లిదండ్రులు జనార్ధన్, నిర్మలలను సత్కరించారు. విద్యార్థుల విజయానికి కుటుంబాల ప్రోత్సాహం ఎంత కీలకమో ఈ సందర్భంగా స్పష్టమైంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ — “అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం… ఈ మూడు కలిసివచ్చినప్పుడే ఇలాంటి ఫలితాలు సాధ్యమవుతాయి” అని పేర్కొన్నారు. ఈ విజయాన్ని మొత్తం బృందం సమిష్టి కృషిగా అభివర్ణించారు. పూర్తిస్థాయి ఉత్తీర్ణత శాతం సాధించడం మరో ముఖ్య విశేషంగా నిలిచింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ, వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించేలా ఈ విజయాలు వారికి పునాది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి. తిరుపతి రావు, ఎ. రామేశ్వర్ రావు, పి. సురేష్, ఎస్. శ్రీధర్, రవీంద్ర బాబు, ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎన్. మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ టి. పరమేశ్వరి, ఉపాధ్యాయులు పి. కవిత, ఎం. దుర్గా భవాని, మేరీ, విజయలక్ష్మి, ఆనంద్ మదిలెట్టి, సింధూర్ ప్రబంధన్ తదితరులు పాల్గొన్నారు.జగద్గిరిగుట్టలో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయనే దానికి ఈ ఫలితాలు మరో నిదర్శనంగా నిలిచాయి.