
జనం న్యూస్ సెప్టెంబర్ 2 కోటబొమ్మాళి మండలం :ఉత్తరాంధ్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైందని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు అన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేయడం దశాబ్దాల కల సాకారమైన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. పాయకరావుపేట మండలం సీతారాంపురం (పీ.ఎల్.పురం) వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జలహారతి ని ఇచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలికారు.447 మీటర్ల అక్విడక్ట్ వద్ద గేట్లు ఎత్తి గోదావరి జలాలను అధికారికంగా విడుదల చేయడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచిందని బోయిన గోవిందరాజులు తెలిపారు. తొలి దశలో 27–30 టీఎంసీల గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు మళ్లించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నాలుగు జిల్లాల్లోని 2,87,320 ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందనుందని చెప్పారు. అలాగే సుమారు 5.23 లక్షల మంది ప్రజలకు తాగునీటి భద్రత కలగడంతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత మరింత మెరుగుపడనుందని వివరించారు.213 కిలోమీటర్ల పొడవైన ఎడమ ప్రధాన కాలువతో పాటు అక్విడక్ట్లు, సైఫన్ల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4,192 కోట్ల వ్యయం చేసినట్లు తెలిపారు. ప్రధాన పోలవరం డ్యామ్ పనులు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు తక్షణ ప్రయోజనం అందించాలనే లక్ష్యంతో కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమన్నారు.గోదావరి–తాండవ నదుల అనుసంధానంతో ఉత్తరాంధ్రలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని బోయిన గోవిందరాజులు ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఉద్యానవనం, పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.“నీరు ఉంటేనే రైతుకు భరోసా.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది” అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి పోలవరం ఎడమ కాలువ నీటి విడుదల కార్యరూపంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.పోలవరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్నది కేవలం గోదావరి నీరు మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర రైతుల ఆశలు, అభివృద్ధి ఆకాంక్షలు, రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రవహిస్తున్నాయని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు అన్నారు. అంతేకాకుండా ఈ గోదావరి జలాలను శ్రీకాకుళంలో గల నదులన్నింటికీ అనుసంధానించితే చరిత్ర పుటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచిపోతుందని గోవిందరాజులు తన అభిలాష, ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సరిచేయండి