కొయ్యురు ఏపీటిడబ్ల్యూఆర్ పాఠశాలలో గురువారం రోజు కొయ్యూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి శ్రీనివాసరావు,

★మంప ఎస్సై శ్రీనివాస్ కలిసి పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జనం న్యూస్ జులై 3 ( కొయ్యలు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం వల్ల వ్యక్తి, కుటుంబం మరియు సమాజంపై కలిగే తీవ్రమైన దుష్పరి ణామాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్‌కు బానిసైతే విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటాయని, జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా చుట్టుపక్కల అవగాహన కల్పించాలని, ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని వివరించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని సూచించారు. సైబర్ నేరాలపై విద్యార్థులను అప్రమత్తం చేస్తూ, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పరాదని, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్ మరియు అసభ్యకర పోస్టులను షేర్ చేయకూడదని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టాల గురించి వివరించి, మహిళల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలని, వేధింపులు, ర్యాగింగ్, బుల్లీయింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని తెలియజేశారు. విద్యార్థులు విద్యనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని, మంచి నైతిక విలువలను అలవరచుకోవాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గౌరవించాలని, దేశానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు. యువత తమ శక్తిని సమాజ అభివృద్ధికి వినియోగించి, నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.