ఏజెన్సీ పాఠశాలల తరగతుల కుదింపు,ఎత్తివేతల కుట్రను సాహించాం : ఎ.ఎస్.పి

★ఆదివాసి విద్యా సంస్థలపై ప్రభుత్వ దాడిని సహించేది లేదు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ★ముందు తరగతుల కుదింపు.. ఆ తర్వాత పాఠశాలల మూసివేత,ఆపై పోస్టుల ఎత్తివేతకు కుట్ర ★రేషనలైజేషన్' పేరుతో ఆదివాసి విద్యను సర్వనాశనం చేస్తోన్న సర్కార్

జనం న్యూస్/జులై 1/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : ఎన్.ఎస్.ఆర్ రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ మరియు స్టాండర్డైజేషన్ పేరుతో ఆదివాసి సంక్షేమ శాఖ విద్యా సంస్థలపై దారుణమైన దాడికి ఒడిగడుతోందని ఆదివాసి సంక్షేమ పరిషత్ (ఎ.ఎస్.పి ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంపచోడవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదివాసి ప్రాంతాల్లో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా అడుగులు వేస్తోందని మండిపడ్డారు.ఈ సందర్భంగా కుంజా శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు వర్షం కురిపించారు.పాఠశాలల మూసివేతకు వ్యూహాత్మక కుట్ర: రేష్నలైజేషన్ సాకుతో 3 నుండి 10వ తరగతి వరకు ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో 3, 4 తరగతులను దారుణంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారనే నెపంతో అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 8, 9 తరగతులను ఎత్తివేసి, వాటిని కేవలం 7వ తరగతి వరకే పరిమితం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనేక జీపీఎస్ పాఠశాలలను సైతం రేషనలైజేషన్ పేరుతో మూసివేస్తున్నారని, ఈ ప్రక్రియ అంతా చివరకు ఉపాధ్యాయ పోస్టులను శాశ్వతంగా ఎత్తివేసేందుకేనని నిప్పులు చెరిగారు. ఆదివాసులు చదువుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదా?: 21వ శతాబ్దంలో ఆదివాసీలు ఇప్పుడిప్పుడే విద్యాపరంగా రాణిస్తూ, ఉద్యోగ అవకాశాలు పొందే స్థాయికి ఎదుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి వినాశకరమైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే 100% ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించే చారిత్రాత్మక జీవో నెం. 3ని రద్దు చేయించి ఆదివాసీలకు అన్యాయం చేశారని, ఇప్పుడు నిబంధనల పేరుతో ఉన్న పాఠశాలలను కూడా దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.భౌగోళిక పరిస్థితులను విస్మరించిన సర్కార్: ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు గుంపులు గుంపులుగా, విసిరేసినట్టు ఉండే గూడేలలో జీవిస్తారని,వారికి నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో విద్యా సంస్థలు ఉంటేనే పిల్లలు చదువుకోవడానికి ముందుకు వస్తారని స్పష్టం చేశారు. అలాంటిది ఉన్న పాఠశాలలనే ఎత్తివేస్తూ పోతే ఆదివాసి ప్రాంతాల్లో విద్యాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని, ఆదివాసులు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక జారిచేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి తరగతుల కుదింపు ప్రక్రియను నిలిపివేయాలని,అన్ని ఆదివాసి ఆశ్రమ మరియు జీపీఎస్ పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని కుంజా శ్రీను గట్టిగా డిమాండ్ చేశారు. ఆదివాసీల విద్యా హక్కును కాలరాసే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై అత్యంత ఉధృతమైన రీతిలో ఆదివాసి మహా ఉద్యమాన్ని ఉమ్మడి ఏజెన్సీ వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు కంగాల అబ్బాయి దొర, పీఠ ప్రసాద్,చోడి ఏడుకొండలు రావు దొర,బల్లెం గంగాభవాని,కోటం రాజన్న దొర,శారద దేవి,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.