ఉపాధి హామీ పథకంలో నూతన విధానానికి శ్రీకారం – వానవోలులో వీబీ–జీ–రామ్ జీ కార్యక్రమం ప్రారంభం

జనం న్యూస్ , జూలై 2, (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత & జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలం వానవోలు గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి బదులుగా అమల్లోకి వచ్చిన వీబీ–జీ–రామ్ జీ నూతన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ కమలాభాయ్, టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడం, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గతంలో కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా, నూతన విధానంలో 125 రోజుల వరకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగిరెడ్డి, టీఏ భాస్కర్ రెడ్డి, రంగనాథం, ఈశ్వరయ్య, టైలర్ రమణ, లక్ష్మీనారాయణ రెడ్డి (గుంటిపల్లి), ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, రాజు, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.