అడుగంటుతున్న మానవ సంబంధాల నుండి పుట్టిందే ‘కన్నవారి కన్నీటి వేదన’ : బిసి రాజారెడ్డి

ఆన్ లైన్ లో అంత్యక్రియలు చేసే స్థాయికి దిగజారడం అత్యంత బాధాకరం

జనం న్యూస్ సెప్టెంబర్ 2 బనగానపల్లె నేటి సమాజంలో అడుగంటుతున్న మానవ సంబంధాల నుంచి పుట్టిందే 'కన్నవారి కన్నీటి వేదన' రచన అని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షులు బిసి రాజారెడ్డి అన్నారు. బనగానపల్లె పట్టణం బిసి గుర్రెడ్డి కాలనీలో బుధవారం సాయంత్రం బిసి రాజారెడ్డి రచించిన 'కన్నవారి కన్నీటి వేదన' ఒక హృదయ విదారక కథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బిసి రాజారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో కుటుంబ బంధాలు నానాటికి దిగజారిపోతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అమ్మా నాన్నలతో పిల్లలకు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల మధ్య అనుబంధాలు రాను రాను పలచన అవుతుండడం బాధాకరమన్నారు. డబ్బులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మానవ బంధాలను మర్చిపోతున్నారన్నారు. కని పెంచిన తల్లిదండ్రులను నేటి యువత నిర్లక్ష్యం చేస్తూ అవసాన దశలో వారిని ఆదరించకుండా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న దారుణ పరిస్థితులు చూస్తుంటే మనసుకు బాధ కలుగుతుందన్నారు. డాలర్ మోజులో పడి సంవత్సరాల తరబడి విదేశాల్లోనే ఉంటూ చివరకు కన్న తల్లిదండ్రులు మరణిస్తే వారి అంత్యక్రియలను ఆన్ లైన్ లో చేసే స్థాయికి మానవ సంబంధాలు దిగజారిన దౌర్భాగ్య స్థితిలోకి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణ పరిస్థితులు మన సమాజానికి ఆమోదయోగ్యం కాదన్నారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల తీరు మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. చివరి దశలో వారి ఆలనా పాలన చూసుకోవడం ఒక బాధ్యత అని నేటి యువత గుర్తించాలన్నారు. తాను ఇప్పటి వరకు ఏడు పుస్తకాలు రాయడం జరిగిందన్నారు. మొదటి పుస్తకం అయ్యప్ప స్వామి పాటలు, రెండోది జీవిత సత్యాలు, మూడవ పుస్తకం బనగానపల్లె చరిత్ర, నాలుగోది సమాజంలో 100 నిత్య సత్యాలు, ఐదు మానవ జీవన యానం, ఆరు నాన్న నన్ను క్షమించు అనే పుస్తకాలు రాయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాసిన ఏడో పుస్తకం కన్నవారి కన్నీటి వేదన యువతకు ఓ మేల్కొలుపు కావాలని ఆకాంక్షించారు. ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఇనాయతుల్లా మాట్లాడుతూ... ప్రతి కొడుకు తన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత పాటించడం అనే బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన ఆవశ్యకతను, బాధ్యతను బిసి రాజారెడ్డి గారు రాసిన కన్నవారి కన్నీటి వేదన కథ అందరికీ గుర్తు చేస్తుందన్నారు. ప్రతి మనిషి మొట్ట మొదట కృతజ్ఞుడుగా ఉండాల్సింది తల్లిదండ్రులకు, ఆ తర్వాత విద్య నేర్పిన గురువులకు అన్నారు. బిసి రాజారెడ్డి గారు రాసిన కన్నవారి కన్నీటి వేదన అనే పుస్తకాన్ని ఈ తరం యువత తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉందన్నారు. డ్యాన్స్ మాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందర్నీ అలరించాయి. కార్యక్రమంలో ఎంఈఓ స్వరూపారాణి, రిటైర్డ్ హెచ్ఎం ఐఎన్ పక్కీరా రెడ్డి, భగవద్గీత ప్రచారకులు గురూజీ రామశేషయ్య, ప్రముఖ గజల్ గాయకుడు మహమ్మద్ మియా, పట్టణ ప్రజలు, బిసి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.